నర్సాపూర్, అక్టోబర్ 21 : నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల బాలుర నుంచి ఇద్దరు విద్యార్థులు పారిపోయిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణానికి చెందిన మహమ్మద్ అమెర్ (12), మహమ్మద్ నవాజ్ అలీ(11) అనే అన్నదమ్ములు నర్సాపూర్‌లోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో 8, 7వ తరగతి చదువుతున్నారు. మంగళవారం నాడు ఉదయం 6.30 గంటలకు గ్రౌండ్లో ఆడుకుంటూ అక్కడి నుంచే పారిపోయారు. పాఠశాల సిబ్బంది పిల్లల తల్లి సహాయంతో నర్సాపూర్ పట్టణం అంతా వెతికినా ఆచూకీ లభించలేదు.
గత మూడు సంవత్సరాలుగా వారి తల్లిదండ్రులకు గొడవలు జరుగుతున్నందున వారి తల్లిదండ్రులు ఇద్దరు దూరంగా ఉంటున్నారు. తల్లి నర్సాపూర్‌లో నివాసం ఉండగా.. తండ్రి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలు బస్టాండ్‌కి వెళ్లి.. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి గూగుల్ పే చేయించుకున్నారు. తండ్రికి ఫోన్ చేసి వివరాలు అడగ్గా సరిగ్గా స్పందించలేదని ఎస్ఐ రంజిత్ కుమార్ వెల్లడించారు. విద్యార్థులు పారిపోయిన సమయంలో మహమ్మద్ అమెర్ గ్రీన్ చెక్స్ షర్ట్ ధరించి ఉన్నాడని, మహమ్మద్ నవాజ్ ఆలీ గ్రీన్ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు. పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నసీమా షేక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.