గురుగ్రాం : మద్యం మత్తులో మాస్క్ లేకుండా వచ్చిన కస్టమర్‌ను స్పా యజమాని తిప్పిపంపడంతో సదరు కస్టమర్ దాడికి పాల్పడిన ఘటన పాలం విహార్‌లో వెలుగుచూసింది. జనవరి 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం సేవించి వచ్చిన కస్టమర్‌ను మాస్క్ ధరించాలని, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపాలని స్పా యజమాని సుమన్ పాండే (42) కోరింది. దీంతో ఆమెపై దుర్భాషలకు దిగడంతో పాటు కోపంతో ఊగిపోతూ ఆమెపై దాడికి తెగబడ్డాడు. కస్టమర్ ఆమె కుడి కన్ను, పొట్టపై కొట్టడంతో గాయాలయ్యాయి.
ఘటనపై ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆమె సీసీటీవీ ఫుటేజ్, నిందితుడి వాహన నెంబర్ ను పోలీసులకు అందచేసింది. అనుమానితుడిని గుర్తించామని త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని డీసీపీ దీపక్ సహరన్ తెలిపారు.