Paragliding accident | పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదం సంభవించి ఓ దక్షిణ కొరియా వాసి దుర్మరణం పాలయ్యాడు. పారాగ్లైడర్ తెరుచుకోకపోవడంతో 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడి మరణించాడు. ఈ ప్రమాదం గుజరాత్లోని మెహసానా జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కడి పట్టణం సమీపంలోని విసత్పురా గ్రామంలోని పాఠశాల మైదానంలో సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో దక్షిణ కొరియాకు చెందిన షిన్ బైయాంగ్ మూన్ తన పారాగ్లైడర్ సాయంతో ఆకాశంలోకి ఎగిరేందుకు ప్రయత్నించాడు. అయితే, పారాగ్లైడర్ కనోపీ తెరుచుకోవడంలో విఫలమైంది. దాంతో షిన్ 50 అడుగుల ఎత్తు పైనుంచి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన షిన్ను చికిత్స నిమిత్తం ఆయన స్నేహితులు సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై చనిపోయాడు. కడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నికుంజ్ పటేల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
షిన్ వడోదర పర్యటన నిమిత్తం గుజరాత్ వచ్చాడు. అతడితోపాటు కొరియన్ స్నేహితుడు కడి పట్టణం సమీపంలోని విసత్పురా గ్రామానికి వచ్చారు. కడి పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదైంది. వడోదరలోని బాధితుడి బంధువులు, స్నేహితులు, కొరియన్ ఎంబసీకి సంఘటన గురించి పోలీసులు సమాచారం అందించారు. షిన్ మృతదేహాన్ని అతడి స్వదేశానికి పంపే ప్రక్రియ కొనసాగుతున్నదని ఇన్స్పెక్టర్ పటేల్ తెలిపారు.