ముదిగొండ : ముదిగొండలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్నపేలుడు పదార్దాలను ముదిగొండ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కుంచం సురేష్, కుంచం వెంకన్న అనే వ్యక్తులు కారులో పేలుడు పదార్దాలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముందిగొండలో ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన కారుపై అనుమానంతో క్షుణ్నంగా తనిఖీ చేయగా డిక్కీలో పేలుడు పదర్దాలు ఉన్న బాక్సులను గుర్తించారు.
మొత్తం తొమ్మిది బాక్సుల్లో తొమ్మిది పేలుడు పదార్దాలతో పాటు, కరెంటు వైర్లు, ఇతర ఎలక్ట్రికల్ సామగ్రి ఉన్నాయి. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా పేలుడు పదార్థాలు తరలిస్తుండడంతో వీరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కారును, పేలుడు సామగ్రిని సీజ్ చేశారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.