భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉత్తరప్రదేశ్ సర్కార్ స్టైల్‌ను ఫాలో అవుతున్నది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుల ఇళ్లను బుల్డోజర్తో నేలమట్టం చేసింది. రేవా జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. స్వయంగా దేవుడని చెప్పుకునే మహంత్ సీతారామ్ దాస్, అలియాస్ సమర్థ్ త్రిపాఠి ఇటీవల రేవా సర్క్యూట్ హౌస్‌లో ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలువచ్చాయి. మార్చి 28న అతడి అనుచరులు సత్నాకు చెందిన బాలికకు మాయమాటలు చెప్పి సర్క్యూట్ హౌస్‌కు తీసుకువచ్చారు. మద్యం సేవించిన వారు ఆమెతో కూడా బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం సీతారామ్ దాస్ గదికి ఆమెను పంపగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ బాలికను తిరిగి ఊరికి తీసుకెళ్తుండగా కారులోంచి ఆమె దూకింది. మార్చి 29న పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో మార్చి 30న మహంత్ సీతారామ్ దాస్‌ను అరెస్ట్ చేశారు. దాస్ ప్రధాన అనుచరుడు, రౌడీ షీటర్ వినోద్ పాండే పేరుతో రూమ్ బుక్ చేసి ఉండటంతో అతడ్ని కూడా అరెస్ట్ చేశారు. రేవాకు చెందిన మోను, ధీరేంద్ర మిశ్రాతో సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.
కాగా, బాలికపై అత్యాచారం ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం రేపింది. రేవాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అక్రమార్కుల ఆస్తులను బుల్డోజర్తో ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గర్హ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుద్వా గ్రామంలో ఉన్న సీతారాం దాస్ ఇంటితోపాటు గార్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకోరి గ్రామంలో ఉన్న అనుచరుడు వినోద్ పాండే ఇంటిని జేసీబీతో గురువారం ధ్వంసం చేసినట్లు రేవా కలెక్టర్ మనోజ్ పుష్ప్ శుక్రవారం తెలిపారు.