లక్నో: టీచర్‌ను కిడ్నాప్ చేసిన స్కూల్ ప్రిన్సిపాల్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్లో 22 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది. అయితే స్కూల్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్‌కు ఆమెపై కన్నుపడింది. రెండు నెలల కిందట స్కూల్‌కు సంబంధించిన పని కోసం సహాయంగా ఆమెను తన వెంట తీసుకెళ్లాడు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. మత్తులో ఉన్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు.
కాగా, నాటి నుంచి ఆ వీడియోను చూపించి తన వద్దకు రావాలని టీచర్‌ను అతడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ యువతి ఈ నెల 26న ఈ విషయాన్ని తన కుటుంబానికి చెప్పింది. దీంతో ఆ వీడియోను డిలీట్ చేయాలని ఆమె తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపాల్‌ను డిమాండ్ చేశారు. అయితే వారిని బెదిరించిన అతడు ఆ టీచర్‌ను కిడ్నాప్ చేశాడు. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే కిడ్నాప్ అయిన ఆ యువతి ఆచూకీ ఇంకా తెలియలేదు. కాగా, బాధిత కుటుంబాన్ని మంత్రి సురేష్ ఖన్నా కలిశారు. ఆ మహిళను వెతికి ఆమె ఆచూకీని త్వరలో కనుగొంటామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.