లక్నో: రోడ్డు పక్కన బండిపై బట్టలు అమ్మే వ్యాపారికి ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది గన్స్‌తో ఆ చిరు వ్యాపారికి భద్రత కల్పిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఈటాహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రోడ్డు పక్కన వ్యాపారి చేసే రామేశ్వర్ దయాల్ ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ యాదవ్, జిల్లా పంచాయతీ మాజీ ప్రెసిడెంట్‌పై ఫిర్యాదు చేశాడు. తన భూమిని అమ్మాలని ఒత్తిడి చేయడంతోపాటు కులపరంగా దూషించారని ఆరోపించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా గత నెలలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అది తప్పుడు ఫిర్యాదు అని, దీనిని కొట్టివేయాలంటూ వారిద్దరూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో రామేశ్వర్ దయాల్‌ను కోర్టు పిలిపించింది. కోర్టుకు శనివరం హాజరైన ఆయన తనకు భద్రత కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో రామేశ్వర్ దయాల్‌కు వ్యక్తిగత భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏకే 47 రెఫిల్స్ కలిగిన ఇద్దరు పోలీస్ సిబ్బందిని ఆయనకు భద్రతగా ఏర్పాటు చేశారు. దీంతో గన్స్‌తో పక్కన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉండగా రామేశ్వర్ దయాల్ యథావిధిగా రోడ్డు పక్కన బండిపై బట్టల వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే చూసేవారికి ఇది వింతంగా కనిపిస్తున్నది.