మన్సూరాబాద్ : యువతిపై పలుమార్లు కత్తితో పొడిచి దారుణానికి ఒడిగట్టిన ప్రేమోన్మోదిని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. పెండ్లికి నిరాకరించిందన్న కోపంతో హస్తినాపురం సెంట్రల్లో తన పిన్ని ఇంట్లో నివాసముంటున్న యువతిపై బుధవారం బస్వరాజు అనే యువకుడు కత్తితో ఇరవై సార్లు విచక్షణారహితంగా పొడిచిన విషయం తెలిసిందే.
సదరు యువతీ, యువకుడు వికారాబాద్ జిల్లా, దౌల్తాబాద్ మండలానికి చెందిన వారు. వీరిద్దరు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న పెద్దలు సదరు యువతిని హస్తినాపురం సెంట్రల్లో ఉండే ఆమె పిన్ని వద్ద ఉంచుతున్నారు. యువతికి ఈ మధ్యనే మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది.
పెద్దలు కుదర్చిన పెండ్లి చేసుకునేందుకు అంగీకరించింది. తన ప్రేమను నిరాకరించి వేరే యువకుడిని పెండ్లి చేసుకుం టుందన్న కోపంతో బస్వరాజు బుధవారం మధ్యహ్నం కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సదరు యువతి హస్తినాపురంలోని నవీన హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో యువతిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని.. కత్తితో పొడిచిన శరీరంలోని కొన్ని ప్రదేశాలలో కొద్ది పాటి రక్తస్రావం జరుగు తుందని ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్సను అందజేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. యువతిపై కత్తితో దాడికి పాల్పడిన బస్వరాజుపై ఐపీసీ సెక్షన్లు 452, 307, 354, 25బీ ఆఫ్ ఆర్మ్ యాక్టుల కింద కేసు నమోదు చేసినట్లు ఎల్బీనగర్ సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.