పనాజీ: రిమాండ్ నిమిత్తం జైలుకు వచ్చిన లైంగికదాడి నిందితుల పట్ల ఖైదీలు అమానుషంగా ప్రవర్తించారు. నిందితుల దుస్తులు తీయించి వారితో నగ్నంగా గుంజీలు తీయించారు. ఈ సందర్భంగా మిగతా ఖైదీలు ఉత్సాహా పరుస్తూ చప్పట్లు కొట్టారు. గోవా జైలులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గోవా బీచ్‌లో ఇటీవల ఇద్దరు యువతులపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన ఒక నిందితుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించడంతో జైలులోని ప్రత్యేక బ్లాక్‌లో ఉంచారు. సాధారణ జైలు వార్డులో ఉన్న మిగతా ముగ్గురు నిందితులతో ఖైదీలు ఆడుకున్నారు. వారిని దుస్తులు విప్పించి నగ్నంగా గుంజీలు తీయించారు. నిందితులు గుంజీలు తీస్తుండగా ఖైదీలు చప్పట్లు కొట్టి వారిని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. గోవా జైలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
కాగా, జైలు ఐజీ వెనాన్సియో ఫుర్టాడో దీనిపై తీవ్రంగా స్పందించారు. దర్యాప్తు జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. నిందితులపట్ల అమానుషంగా ప్రవర్తించిన ఖైదీలపై జైలు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో జైలు సిబ్బంది పాత్ర ఉంటే వారిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జైలులోకి కొత్తగా వచ్చిన నిందితుల పట్ల సీనియర్ ఖైదీలు ఇలా ప్రవర్తించే సంప్రదాయం రోటీన్‌గా కొనసాగుతున్నదా అన్నదానిపైనా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.