కోల్‌కతా : లిఫ్ట్ అడిగిన యువతిని ఏఎస్పీతో పాటు పోలీస్ వాలంటీర్ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కోల్‌కతాలో శనివారం వెలుగుచూసింది. కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసేందుకు అసన్సోల్ నుంచి కోల్‌కతాకు మహిళ (25) బస్‌లో ప్రయాణిస్తూ శనివారం రాత్రి 12.30 గంటలకు సాల్ట్‌లేక్ సమీపంలోని కరుణామోయి బస్టాండ్‌లో దిగింది.
ఆ సమయంలో ఆమె మొబైల్ పోన్ చార్జింగ్ లేకపోవడంతో క్యాబ్ బుక్ చేసుకోలేకపోయింది. అక్కడ ట్యాక్సీలూ కనిపించకపోవడంతో పోలీస్ బైక్‌లపై ఉన్న ముగ్గురు వ్యక్తులను ఆమె సంప్రదించింది. వారు ఆమెను గమ్యస్ధానంలో దింపుతామని చెప్పి బైక్‌పై ఎక్కించుకున్నారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత పోలీస్ వాలంటీర్ బైక్‌ను ఆపగా ఏఎస్పీ యువతి వెనుక కూర్చున్నాడు. బైక్ మధ్యలో ఉన్న యువతిని వారు లైంగికంగా వేధించారు.
తనను బెలియఘట బైపాస్ వద్ద డ్రాప్ చేయాలని ఆమె కోరగా పోలీసులు ఉద్దేశపూర్వకంగా సాల్ట్‌లేక్ వీధుల్లో తిప్పుతూ అభ్యంతరకరంగా వ్యవహరించారు. చివరికి రోడ్డుపై యువతిని వదిలివెళ్లిన పోలీసులు ఈ ఘటనపై ఎక్కడా నోరుమెదపవద్దని హెచ్చరించారు. ధైర్యం కూడదీసుకున్న యువతి కస్బా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కస్బా పోలీసులు నిందితులైన పోలీస్ వాలంటీర్ అభిషేక్ మలకర్, ఎఎస్పీ సందీప్ కుమార్ పాల్‌ను అరెస్ట్ చేశారు.