పాట్నా : బీహార్లో మద్యపానం నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పలువురు వ్యక్తులు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లో మద్యాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పిర్బహోర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కదాం ఘాట్ వద్ద ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 50 లీటర్ల మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. సిలిండర్ కింది భాగాన్ని తొలగించి, దాంట్లో మద్యం సీసాలను ఉంచి తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
మద్యం సేవించిన వ్యక్తులు పట్టుబడితే జరిమానా విధించాలని ఇటీవలే బీహార్ అసెంబ్లీ చట్టం చేసింది. ఇలాంటి వ్యక్తులు మొదటిసారి పట్టుబడితే రూ. 2 వేల నుంచి రూ. 5 వేల మధ్య జరిమానా విధించనున్నారు. జరిమానా చెల్లించని యెడల ఒక నెల రోజుల పాటు జైలు శిక్ష విధించనున్నారు.