బెంగళూర్ : మైసూర్ సామూహిక లైంగిక దాడి ఘటనలో బాధితురాలు ఫోటోల ఆధారంగా నిందితులను గుర్తించింది. మరోవైపు ఆగస్ట్ 24న మైసూర్ శివార్లలోని నిర్జన ప్రదేశంలో జరిగిన ఈ ఘోర ఉదంతంలో ఏడవ నిందితుడి కోసం తమిళనాడులోని తిరుపూర్‌లో 20 మంది పోలీస్ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం గాలింపు ముమ్మరం చేసింది. ఆరుగురు పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది ఏడో నిందితుడి కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
ఇక దవాఖానలో చికిత్స పొందుతున్న లైంగిక దాడి బాధితురాలు ఇంకా షాక్‌లోనే ఉందని పోలీసులు తెలిపారు. నిందితుల ఫోటోగ్రాఫ్‌లను చూసి వారిని ఆమె గుర్తుపట్టిందని చెప్పారు. బాధితురాలి పరిస్థితిని గమనించిన పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఆమె పూర్తిగా కోలుకున్నతర్వాతే స్టేట్మెంట్ రికార్డు చేయాలని నిర్ణయించారు. ఇక కోర్టు అనుమతితో పోలీసులు ముగ్గురు నిందితులను తిరుపూర్‌కు తీసుకువచ్చారు. ఏడో నిందితుడి నేర నేపథ్యం గురించి తమిళనాడు పోలీసులను కర్నాటక పోలీసులు ఆరా తీస్తున్నారు. మైసూర్ సామూహిక లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.