మహబూబాబాద్ : ట్రాక్టర్, జేసీబీ ఓనర్లకు రూ. 1.80కోట్లు టోకరా పెట్టాడు. బాధితులు లబోదిబో అంటూ మహబూబాబాద్ టౌన్ పోలీ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితుల ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన నాగేంద్ర అను వ్యక్తి వరంగల్‌లోని ఓ ట్రాక్టర్ యాజమానికి ట్రాక్టర్ జీహెచ్ఎంసీలో పెట్టిస్తానని రూ. 2లక్షలు తీసుకున్నాడు. అన్న ప్రకారమే నెల తర్వాత నాగేంద్ర జీహెచ్ఎంసీ నుంచి రూ. 60వేల ఎంగేజ్ను ఇప్పించాడు. దీంతో సదరు యాజమాని జీహెచ్ఎంసీ నుంచి ఎంగేజ్ రూపంలో వచ్చిన నగదు విషయం ట్రాక్టర్ ఓనర్స్ వాట్సాప్ గ్రూపుల్లో పంపించాడు.
దీంతో ట్రాక్టర్లకు ఏం పని లేదు కదా.. అనే కోణంలో ఆలోచించారు. నాగేంద్ర సెల్ నంబర్‌ను సంప్రదించిన ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన ట్రాక్టర్, జేసీబీ ఓనర్లు సుమారు వందమంది దాక రూ. 2 లక్షల చొప్పున సమర్పించుకున్నారు. అనుకున్న సమయం ప్రకారం.. నాగేంద్ర సెల్ నంబర్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాప్ వస్తుంది. నాగేంద్ర సుమారు 100మంది ట్రాక్టర్, జేసీబీ డ్రైవర్లు రూ. 1.80 కోట్లు స్వాహా చేశాడు. దీంతో ఆందోళన చెందిన ట్రాక్టర్, జేసీబీల ఓనర్లు నాగేంద్ర ఉండే ఉప్పల్ పరిధి పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు.
ఆదివారం మహబూబాబాద్ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఏం పనిలేక ట్రాక్టర్లు, జేసీబీలు ఖాళీగా ఉంటున్నాయని ఆశపడి కమిషన్ రూపంలో లక్షలు ఇచ్చామని చెప్పారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై పరిశీలించి నాగేంద్రపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై టౌన్ ఎస్సై రమాదేవిని వివరణ కోరగా ఆంధ్రాకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి తమ వద్ద కమిషన్ కోసం ఒక్కోక్కరి దగ్గర నుంచి రూ. లక్షల్లో వసూలు చేశాడని ఫిర్యాదులో వివరించినట్లు చెప్పారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల నోటీసుకు తీసుకెళ్లి చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు.