Student felldown | మీరట్‌లో ఓ డెంటల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆమె స్థానికంగా ఉన్న స్వామి వివేకానంద సుభార్తి మెడికల్ కాలేజీలో డెంటల్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అని పోలీసులు తెలిపారు.
సుభార్తి మెడికల్ కళాశాల నాలుగో అంతస్తు నుంచి దూకి డెంటల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తున్నది. బుధవారం సాయంత్రం నాలుగో అంతస్తు నుంచి దూకినట్లుగా సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువతిని స్థానిక దవాఖానకు తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాలేజీ భవనం పైనుంచి దూకుతున్న వీడియో వైరల్‌గా మారింది.
కాగా, కాలేజీ పైనుంచి దూకడానికి రెండు, మూడు గంటల ముందు బాలిక మొబైల్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. వాతావరణం బాగున్నందున సెల్ఫీ తీసుకునేందుకు బిల్డింగ్ పైకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిందని తోటి విద్యార్థులు చెప్పారు. నాలుగో అంతస్థు రెయిలింగ్‌పై నిలబడినప్పుడు దూకవద్దని కింద విద్యార్థులు కేకలు వేసినా బాలిక ఎవరి మాట వినిపించుకోలేదని వారు తెలిపారు. స్నేహితురాలితో ఫోన్లో గొడవపడిన ఆ యువతి భవనం పైనుంచి దూకిందని కాలేజీ యాజమాన్యం పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది.