ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. అనుమానంతో మాజీ ప్రియురాలి గొంతుకోసి హత్య చేసేందుకు యువకుడు (23) ప్రయత్నించడం కలకలం రేపింది. జనసమ్మర్ధంతో కూడిన డాక్యార్డ్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడు మోహిత్ అలియాస్ బంటీని నేరం జరిగిన 48 గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరో వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోందనే అనుమానంతోనే ఆమెపై దాడి చేశానని నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్ధితి ప్రస్తుతం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడు, బాధితురాలికి రెండేండ్లుగా పరిచయం ఉందని, మహిళకు వివాహం కాగా భర్త చనిపోయాడని దర్యాప్తులో వెల్లడైంది.
వీరు కొంతకాలంగా కలిసి ఉంటుండగా తరచూ ఘర్షణ జరుగుతుండటంతో నిందితుడితో ఆమె తెగతెంపులు చేసుకుని దూరంగా ఉంటోంది. ఆపై మహిళ వదాలా స్టేషన్లోని తన అత్త ఇంటి వద్దకు మకాం మార్చింది. నిందితుడు తరచూ ఫోన్ చేసినా అతడిని దూరం పెట్టింది. ఓ సందర్భంలో ఫోన్ లిఫ్ట్ చేసిన మహిళను మాట్లాడాలని డాక్యార్డ్ రోడ్ స్టేషన్కు పిలిపించి ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.