భోపాల్: ‘జై శ్రీరామ్’ అంటూ పెండ్లి వేడుకలో కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మరణించారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భైంసోడా మండి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జమోనియా గ్రామ మాజీ సర్పంచ్ దేవిలాల్ మీనా, ఆరుగురి హత్య కేసులో జైలు శిక్ష పడిన, దేవుడిగా చెప్పుకునే రాంపాల్ ఆధ్వర్యంలో ఒక వివాహ వేడుక జరుగుతున్నది.
ఇంతలో కర్రలు, ఇనుప రాడ్లు, తుపాకీ కలిగిన కొంత మంది అక్కడకు వచ్చారు. జరుగుతున్న పెండ్లి అక్రమమని ఆరోపించారు. పెండ్లికి వచ్చిన వారిపై కొందరు దాడి చేశారు. ఈ గొడవలో ఒక వ్యక్తి జరిపిన తుపాకీ కాల్పుల్లో దేవీలాల్ మీనాకు బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో పెండ్లికి వచ్చిన వారిలో కొందరు వెంటపడగా దాడి చేసిన వ్యక్తులు పారిపోయారు.
అయితే, తుపాకీ కాల్పుల్లో గాయపడిన దేవీలాల్ రాజస్థాన్‌లోని కోటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రెండు సార్లు జమోనియా గ్రామ సర్పంచ్‌గా గెలిచిన ఆయన రాష్ట్రంలోని అధికార బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. మరోవైపు 11 మందిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.