Crime news : అత్త చెప్పిందని ఓ కొడుకు కన్నతల్లిపైనే విషం ప్రయోగం చేసిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. నిందితుడైన కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రా జిల్లా పినహట్ పరిధిలోని బార్పురా గ్రామంలో ఈ దారుణం జరిగింది. నిందితుడు రవీంద్ర జూలై 9న తన తల్లి రామ్మూర్తికి ఇష్టమైన చోలే కూరలో విషం కలిపి వడ్డించాడు. అది తిన్న కాసేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
బాధితురాలి భర్త రణ్వీర్ సింగ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన అత్త ఫూల్వతి ప్రోద్బలంతోనే రవీంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. “నీ తల్లిని అడ్డు తొలగిస్తేనే నా కూతురు నీతో కాపురానికి వస్తుంది” అని ఫూల్వతి షరతు పెట్టిందని, ఆ షరతుకు తమ కొడుకు రవీంద్ర ఒప్పుకున్నాడని ఆయన పేర్కొన్నారు. కొంతకాలంగా కుటుంబంలో భూవివాదం కూడా నడుస్తోందని, ఈ క్రమంలోనే రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని నిందితుడి సోదరుడు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు నిందితుడు రవీంద్ర, అతడి అత్త ఫూల్వతిపై కేసు నమోదు చేశారు. రవీంద్రను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఫూల్వతి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి మెడికల్ రిపోర్టు, ఫోరెన్సిక్ ఆధారాల కోసం ఎదురుచూస్తున్నామని, వాటి ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.