జైపూర్: ఒక వ్యక్తి షాపింగ్ మాల్ రెండవ అంతస్తు నుండి కింద పడి మరణించాడు. ఒక బాలికపై అతడు పడగా ఆమెకు గాయాలయ్యాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. క్రిస్మస్ నేపథ్యంలో ఒక షాపింగ్ మాల్ సందర్శకులతో కిక్కిరిసింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి మాల్ రెండో అంతస్తు నుంచి కింద పడ్డాడు. అక్కడ ఉన్న వారు వెంటనే అతడి వద్దకు వెళ్లి చూడగా చనిపోయినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు ఆ వ్యక్తి ఒక బాలికపై పడటంతో ఆమె గాయపడింది. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, మరణించిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. అయితే అతడు ప్రమాదవశాత్తు మాల్ రెండో అంతస్తు నుంచి కింద పడ్డడా లేక దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది స్పష్టం కాలేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత ఈ ఘటనపై ఒక క్లారిటీ వస్తుందని వెల్లడించారు.