నాగర్కర్నూల్: జిల్లాలోని వెల్దండ మండలంలో కుటుంబ కలహాల కారణంగా ముగ్గురు పిల్లలతో బైక్ పై బయటకు వచ్చిన ఓ తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విషాద ఘటన బుధవారం తెల్లవారుజామున వెల్దండ మండలం పెద్దాపుర్ గ్రామ శివారులోని హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి బూర కుంట సమీపంలో వెలుగు చూసింది. మృతుడు ప్రకాశం జిల్లా ( Prakasam District ) ఎర్రగుంట్ల పాలెం మండలం బోయలపల్లి గ్రామానికి చెందిన గుప్త వెంకటేశ్వర్లు (35)గా గుర్తించారు.
వెంకటేశ్వర్లు ( Venkateshwarlu) , భార్య దీపిక ( Deepika ) తో జరిగిన గొడవల నేపథ్యంలో, పెద్ద కుమార్తె మోక్షిత (8), చిన్న కూతురు వర్షిణి (6), కుమారుడు శివ ధర్మ (4)లను తీసుకొని ఇంటి నుంచి బైక్పై బయటకు వచ్చాడు. అనంతరం నాగర్కర్నూల్ ( Nagarkurnool ) జిల్లా హాజీపూర్, డిండి ప్రాజెక్టు పరిసరాల్లో నాలుగు రోజులుగా తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అయితే అతని వెంట ఉన్న ముగ్గురు పిల్లల ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు.
బుధవారం తెల్లవారుజామున వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో వెల్దండ మండలం పెద్దాపుర్ గ్రామ శివారులో విగతజీవిగా పడి ఉండడం, పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. వెంట తీసుకెళ్లిన ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు.
మొదటగా చిన్న కుమార్తె, కుమారుడిని హాజీపూర్ వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో వదిలి పెట్రోల్ పోయించుకొని వస్తామంటూ విడిచి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు . పెద్ద కుమార్తె వెంటబెట్టుకొని వచ్చినా ఆమె కూడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు పిల్లల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భార్య దీపిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు, వెల్దండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.