భోపాల్ : మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ వ్యక్తి బెంగాలి స్క్వేర్ ఏరియాలో 16 ఏండ్ల బాలికపై గతనెల లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు కొద్దికాలంగా బాలిక వెంటపడుతూ ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఆమె మొబైల్ నెంబర్ తీసుకోవడంతో ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. తనను కలిసేందుకు బెంగాలి స్క్వేర్ ఏరియాకు రావాలని నిందితుడు కోరాడు. ఆపై అక్కడకు వచ్చిన బాలికను తాను నివసించే ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బాలికను బెదిరించిన నిందితుడు పలుమార్లు లైంగిక దాడులకు తెగబడ్డాడు.
నిందితుడి తీరుతో విసిగిన బాలిక ధైర్యం కూడదీసుకుని కుటుంబసభ్యులకు విషయం తెలిపింది. దీంతో ఈ వ్యవహారంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.