మహబూబాబాద్ : మహబూబాబాద్ మున్సిపాలిటీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవి దారుణ హత్యకు గురయ్యాడు. పత్తిపాకలో రోడ్డు పక్కన నిల్చున్న రవిపై గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ గొడ్డలి వేటుకు రవి అక్కడే కుప్పకూలిపోయాడు.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రవిని స్థానికులు గమనించి, ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రవి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బానోత్ రవి 8వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.