కొమురవెల్లి/సిద్దిపేట : ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ లంచం లైన్మెన్ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన జిల్లాలోని కొమురవెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని గౌరాయపల్లిలో హైదరాబాద్కు చెందిన వీరేందర్ అనే వ్యక్తి వ్యవసాయ భూమి కోనుగోలు చేశాడు. గత ఫిబ్రవరిలో ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీ తీసి ఏఈని సంప్రదించాడు. ఏఈ లైన్మెన్ నాగరాజును పిలిచి సదరు వ్యక్తికి ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇవ్వాలని సూచించాడు.
అయినప్పటికి లైన్మెన్ నాగరాజు వీరేందర్ వ్యవసాయ భూమికి కనెక్షన్ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.10వేలకు బేరం కుదిరింది. లంచం ఇవ్వడానికి ఇష్టంలేని వీరేందర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
వారి సూచనల మేరకు..గురువారం కొమురవెల్లి మండల కేంద్రంలో ఓహోటల్ వద్ద వీరేందర్ నుంచి లైన్మెన్ నాగరాజు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు వెంకటరాజాగౌడ్, రమేశ్, తదితరులు ఉన్నారు.