కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం జరిగింది. బెహలా పర్నశ్రీ ఏరియాలోగల ఓ బహుళ అంతస్తుల భవనంలోని ఫ్లాట్‌లో ఒక స్కూల్ టీచర్, ఆమె 14 ఏండ్ల కొడుకు సోమవారం సాయంత్రం దారుణహత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వాళ్లను కిరాతకంగా హత్యచేశారు. భర్త విధుల నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య, కొడుకు ఇద్దరూ రక్తపు మడుగులో పడివున్నారు. దాంతో మృతురాలి భర్త వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి మృతురాలి భర్తను, వారింటికి రోజూ వచ్చే ట్యూషన్ మాస్టర్‌ను పోలీసులు విచారించారు. తాను ఆఫీస్ నుంచి వచ్చే సరికి ఇంటి తలుపులు తీసి ఉన్నాయని, తన కొడుకు బెడ్‌పై రక్తపు మడుగులో పడి ఉన్నాడని, తన ఒంటిపై స్కూల్ యూనిఫాం, టై, బెల్ట్ కూడా అలాగే ఉన్నాయని చెప్పాడు. తన భార్య బెడ్ పక్కనే ఫ్లోర్‌పై రక్తపు మడుగులో పడి ఉందన్నాడు.
తాను సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ట్యూషన్ చెప్పేందుకు వెళ్లేసరికి ఇంటి తలుపులు మూసి ఉన్నాయని, లోపల లైట్లు కూడా ఆఫ్ చేసి ఉన్నాయని, దాంతో వాళ్లు ఇంట్లో లేరని భావించి తిరిగి వెళ్లిపోయానని ట్యూషన్ మాస్టర్ చెప్పాడు. ఇరుగుపొరుగును విచారించగా.. సోమవారం సాయంత్రం తమకు ఎలాంటి అనుమానాస్పద దృశ్యాలు కనిపించలేదన్నారు. పోస్టు మార్టం రిపోర్టు వస్తే ఏమైనా క్లూ దొరికే అవకాశం ఉన్నదని, తమ తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.