నల్లగొండ : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నిందితులను పోలీసులు అరెస్టు చేసి, మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరి గంజాయి ముఠా అరెస్టుకు సంబంధించి వివరాలను మీడియాకు వివరించారు. డీజీపీ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ వివరాల ప్రకారం.. టాస్క్ ఫోర్స్ బృందం, నకిరేకల్ పోలీసులు కేతపల్లి పీఎస్ పరిధిలోని ఎన్‌హెచ్ 65లోని కొర్లపాడ్ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌గా వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన ఓ కారును ఆపి.. తనిఖీలు చేయగా.. అందులో గంజాయిని గుర్తించారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముభిన్ షేక్‌కు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న చందన్‌కుమార్ హరిజన్, పఠాన్ షేక్ అనే వ్యక్తులు పరిచయమయ్యారు. వీరంతా ఏపీలోని విశాఖపట్నంలో తెలిసిన వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసుకొని వెళ్తుండగా.. కొర్లపాడ్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులను గమనించి చందన్‌కుమార్, పఠాన్ షేక్ కారు దిగి పారిపోయగా.. ముబీన్ షేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 25 గంజాయి పాకెట్లలో 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ మొగిలయ్య, నల్లగొండ డీఎస్పీ నరసింహారెడ్డి, శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఎస్ఐ అనిల్‌రెడ్డితో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మాదకద్రవ్యాలను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రెమా రాజేశ్వరి హెచ్చరించారు.