గురుగ్రాం : హర్యానాలోని గురుగ్రాంలో ఓ రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డు అక్కడ ఉండే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేశాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా సెక్యూరిటీ గార్డుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 21న మహిళ వాకింగ్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
మహిళ వాకింగ్ చేస్తుండగా ఆమె వద్దకు వెళ్లిన సెక్యూరిటీ గార్డ్ అసభ్య వ్యాఖ్యలు చేశాడు. నిందితుడు తనకు వ్యాయామం చేయడం ఇష్టమా అని అడిగాడని, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ల విషయంలో సాయం చేస్తానని చెప్పాడంతో పాటు అసభ్య వ్యాఖ్యలు చేశాడని బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
సెక్యూరిటీ గార్డు తీరుతో భయపడిన తాను తిరిగి అపార్ట్మెంట్ రిసెప్షన్‌కు చేరుకుని ఘటన వివరాలు తెలిపానని వెల్లడించింది. తల్లితండ్రులకు కూడా ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఇక సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించామని సొసైటీ ప్రతినిధులు తెలిపారు. గార్డుపై కేసు నమోదు చేశామని అతడిని అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెప్పారు.