న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన ఢిల్లీలో నివసించే మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన పంజాబ్‌కు చెందిన వ్యక్తి (33)ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ ప్రైవేట్ ఫోటోలను ఆన్లైన్లో వైరల్ చేస్తానని నిందితుడు మహిళను బెదిరించాడు. నిందితుడిని జస్మీత్ సింగ్‌గా గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇన్‌స్టాగ్రాంలో మహిళతో పరిచయం చేసుకున్న నిందితుడు కొద్దికాలానికే ఆమెకు దగ్గరయ్యాడు.
ఇద్దరూ వీడియో కాల్స్‌లో మాట్లాడుకునే క్రమంలో నిందితుడు ఆమె ప్రైవేట్ ఫోటోలను తీసుకున్నారు. తనకు డబ్బు ఇవ్వాలని లేకుంటే ప్రైవేట్ ఫోటోలను ఆన్లైన్లో లీక్ చేస్తానని నిందితుడు మహిళను బెదరించాడు. తనతో శారీరకంగా కలవాలని కూడా ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు తాను మహిళను వేధించానని నేరాన్ని అంగీకరించాడు.
ఇక మరో కేసులో మహారాష్ట్రలోని పుణేకు చెందిన వ్యక్తి ఓ మహిళ, ఆమె మైనర్ కూతురు మార్ఫింగ్ ఫోటోలను అసభ్య కామెంట్లతో మహిళ భర్తతో పాటు ఆమె కుటుంబసభ్యులకు పంపాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.