పట్నా : బిహార్‌లోని కతిహార్‌లో దారుణం జరిగింది. లైంగిక దాడి యత్నాన్ని ప్రతిఘటించిన మహిళను తీవ్రంగా హింసించిన నిందితుడి(26)ని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ బుధవారం రాత్రి తన కూతురితో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది.
పొరుగున ఉండే మహ్మద్ షమీం మహిళ ఇంట్లో చొరబడి ఆమెను సమీపంలోని పొలంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించి సాయం కోసం అరవడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. మహిళ కంటికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిపై నిందితుడి అకృత్యాన్ని ఆమె కూతురు అడ్డగించింది.
తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్ధితి కుదుటపడితే స్టేట్మెంట్ రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక బాధితురాలి కూతురు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.