గురుగ్రాం : హర్యానాలోని గురుగ్రాంలో దారుణం వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన కార్మికుడి (42)ని మృతదేహం లభ్యమైన రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. గురుగ్రాంలోని కన్హై కాలనీలో ప్రియుడి చేతిలో హతమైన బాధితురాలిని కమలగా గుర్తించారు. 2018లో కమల భర్తను కూడా తాను అంతమొందించానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించడం కలకలం రేపింది. తమ వివాహేతర సంబంధం మహిళ భర్తకు తెలియడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డానని నిందితుడు వెల్లడించాడు.
ఇక బుధవారం ఉదయం మహిళ హత్య జరగ్గా విగతజీవిగా పడిఉన్న తల్లిని చూసిన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. తన తల్లిని ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి హత్య చేశాడని ఫిర్యాదులో అతడు పేర్కొన్నాడు. మృతదేహాన్ని వైద్య పరీక్షలకు పంపగా హతురాలిని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. నిందితుడు సురేందర్ అలియాస్ దుధియాను సుశాంత్ లోక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసుల బృందం అరెస్ట్ చేసింది.
ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో మంగళవారం సాయంత్రం సురేందర్ కమలను దారుణంగా హత్య చేశాడని ప్రాధమిక దర్యాప్తులో తేలింది.నిందితుడు ఎలాంటి పనిచేయకుండా తాగుడుకు బానిస కావడంతో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేదని పోలీసులు తెలిపారు. 2014 నుంచి నిందితుడు, బాధితురాలి మధ్య వివాహేతర సంబంధం సాగుతోంది. 2018లో కమల భర్తకు విషయం తెలియడంతో నిందితుడు అతడిని హత్య చేసి కాలువలో పడేశాడు. ఆపై గురుగ్రాంలో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.