బెంగళూర్ : భార్య ప్రవర్తనపై అనుమానంతో గొడవపడిన భర్త మద్యం మత్తులో ఆమె గొంతుకోసి ఉసురుతీయడంతో పాటు తానూ తనువు చాలించాడు. బెంగళూర్‌లోని అటిబెలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని అబ్బనపాళ్య ప్రాంతంలో సంపత్ (36) భార్య లావణ్య (30)తో కలిసి నివసిస్తున్నాడు.
మద్యానికి బానిసైన సంపత్ జిగ్నానీలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి దంపతులు గొడవపడ్డారు. భార్యపై కక్ష పెంచుకున్న సంపత్ ఆమె నిద్రిస్తుండగా కత్తితో దాడి చేశాడు. అడ్డుకున్న మైనర్ బాలుడిపైనా దాడికి తెగబడ్డాడు. భార్య గొంతు కోయడంతో రక్తపుమడుగులో ఆమె విగతజీవిగా పడిపోయింది.
భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు పారిపోతుండగా ఇంటి బయట కాలువలో పడిపోయాడు. భార్యపై అనుమానంతోనే సంపత్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇదే కారణంతో గతంలో ఆమెతో విడిపోయిన నిందితుడు పెద్దలు సర్ధిచెప్పడంతో ఆమెతో కలిసి ఉండేందుకు అంగీకరించాడు. స్ధానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.