భోపాల్ : 13 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఉదంతం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఆదివారం వెలుగుచూసింది. బాలిక కనిపించకపోవడంతో శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో గోనె సంచీలపై బాలిక అర్ధనగ్నంగా పడిఉండటం కనిపించింది.
బాలిక మెడ సహా శరీర భాగాలపై గాయాల గుర్తులుండటంతో అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికను ఊపిరాడకుండా చేసి ఉసురు తీశారని ఫోరెన్సిక్ అధికారి ప్రీతి గైక్వాడ్ చెప్పారు. కుటుంబ సభ్యులు పెండ్లికి వెళ్లడంతో శనివారం ఉదయం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది.
వారు తిరిగివచ్చిన తర్వాత బాలిక కనిపించలేదు. ఆదివారం పై అంతస్ధుకు మరోసారి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా బాలిక విగతజీవిగా పడిఉండటం గుర్తించారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.