జైపూర్ : బాలికలు, మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. తుపాకీతో బెదిరించి ఇద్దరు వ్యక్తులు 12 ఏండ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాజస్ధాన్లోని భరత్పూర్లో మే 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు. మే 13 రాత్రి తమ కుమార్తెను ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో బాలికను కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయలేదని, వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.