ఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజా ఘటనలో 87 ఏండ్ల వృద్ధురాలిపై ఆమె ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం డిల్లీలో కలకలం రేపింది. నగరంలోని తిలక్‌నగర్‌లో మంచానికి పరిమితమైన మహిళపై నిందితుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
వృద్ధురాలు కుమార్తె (65) వాకింగ్ చేసేందుకు బయటకు వెళ్లగా మద్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంట్లోకి చొరబడిన నిందితుడు 1.30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లాడు. నిందితుడు ఇంట్లోకి రాగానే లోపలి నుంచి డోర్ వేశాడు.. దీంతో బాధితురాలు ప్రశ్నించగా తాను గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తానని ఎవరో తనను పని నిమిత్తం పిలిపించారని నమ్మబలికాడు.
అనుమానం వచ్చిన వృద్ధురాలు సాయం కోసం కేకలు వేయగా ఆమెను వేధించిన నిందితుడు ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫోన్‌ను దొంగిలించిన నిందితుడు ఆపై పరారయ్యాడు. కాగా బాధితురాలు తన ఫిర్యాదులో దోపిడీ గురించే ఫిర్యాదు చేశారని, లైంగిక దాడి ఘటన గురించి ప్రస్తావించలేదని పోలీసులు తోసిపుచ్చారు. బాధితురాలికి ధైర్యం చెప్పిన పోలీసులు ఆమెకు సంబంధిత నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.