లక్నో: ఉత్తర ప్రదేశ్లో పరువు హత్య వెలుగుచూసింది. ప్రేమికులైన ముస్లిం యువతి, దళిత యువకుడ్ని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారు. యూపీలోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రుధౌలీ ప్రాంతంలోని గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువకుడు అంకిత్ గౌతమ్, 18 ఏళ్ల అమీనా ఖాతూన్ కుటుంబంలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే వారిద్దరి మధ్య సంబంధాన్ని అమీనా కుటుంబం వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఆ యువ జంట అనుమానాస్పదంగా మరణించింది.
శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన అంకిత్ శనివారం ఉదయం గ్రామంలోని పొలంలో శవమై కనిపించాడు. అమీనా కుటుంబ సభ్యులు హత్య చేశారని యువకుడి కుటుంబం ఆరోపించింది. శుక్రవారం రాత్రి అమీనా సోదరుడి నుంచి ఫోన్ రావడంతో వారింటికి వెళ్లిన అంకిత్ తిరిగి రాలేదని పోలీసులకు తెలిపారు. అమీనా సోదరుడి ఇంటి సమీపంలోని పొలాల్లో అతడి మృతదేహం కనిపించిందని ఫిర్యాదు చేశారు. అంకిత్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అతడి మెడ వద్ద కత్తిగాట్లున్నట్లు చెప్పారు. మృతదేహం సమీపంలో లభించిన అతడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం అంకిత్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు అమీనా ఖాతూన్ కూడా శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు. గ్రామస్తుల ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో ఆ జంటది పరువు హత్యగా అనుమానించారు. ఖననం చేసిన అమీనా మృతదేహాన్ని ఆదివారం బయటకు తీశారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ యువ జంట అనుమానాస్పద మరణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమీనా ఇద్దరు సోదరులు, కజిన్పై హత్య, ఆధారాల ధ్వంసం వంటి సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అంకిత్, అమీనా మృతదేహాల పోస్ట్మార్టం రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని బస్తీ రేంజ్ ఐజీ రామకృష్ణ భరద్వాజ్ తెలిపారు.