లక్నో: బాలికకు మత్తు మందు ఇచ్చిన 17 ఏండ్ల బాలుడు తన కుటుంబానికి చెందిన మందులషాపులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 13 ఏండ్ల బాలిక ఆరవ తరగతి చదువుతున్నది. ఈ నెల 7న రాత్రి వేళ ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నది. మార్గమధ్యలో 17 ఏండ్ల బాలుడు ఆ బాలికతో మాట్లాడాడు. తన కుటుంబానికి చెందిన మెడికల్ షాపులోకి ఆమెను తీసుకెళ్లి షట్టర్ మూశాడు. బాలికకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మరోవైపు, కుమార్తె ట్యూషన్ నుంచి ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి, సోదరుడు ఆమె కోసం వెతికారు. తోటి విద్యార్థులను ఆరా తీయగా మెడికల్ షాప్ వద్ద ఒక బాలుడితో మాట్లాడుతుండగా చూసినట్లు చెప్పారు. దీంతో బాలిక తండ్రి, సోదరుడు అక్కడకు వెళ్లారు. మెడికల్ షాప్ మూసి ఉండగా లోపల లైట్ వెలుగుతున్నది.
బాలిక తండ్రి డోర్‌ను తట్టగా ఆ బాలుడు షట్టర్ తెరిచాడు. లోపల కుమార్తె అచేతనంగా, దుస్తులు చెదిరి ఉండటాన్ని గమనించారు. ఆ బాలుడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు ఫోన్ చేశారు. ఇంతలో అక్కడకు వచ్చిన బాలుడి సోదరుడు బాలిక సోదరుడితో వాగ్వాదానికి దిగాడు.
అక్కడకు చేరిన పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలికకు వైద్య పరీక్ష నిర్వహించగా లైంగికదాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదుతో మైనర్ బాలుడిపై పోస్కో చట్టంతోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.