బండ్లగూడ:క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొని బెట్టింగ్ఆడినట్టు స్నేహితుడిని భయపెట్టి అతడివద్దనుంచి డబ్బులు గుంజిన నలుగురిని బుధవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ మేరకు ఏర్పాటుచేసిన విలేకరు ల సమావేశంలో ఏసీపీ సంజయ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. మైలార్‌దేవ్‌పల్లి మధుబన్ కాలనీలో నివసించే శ్రీనివాసరావు(31)ను అతడి స్నేహితులు సుమన్(41), ప్రశాంత్(21), సాయికుమార్(28), వెంకటేశ్వర్రావు(41) లు మోసంచేసి సుమారు 2 లక్షల40 వేల రూపాయలను వసూలు చేశారు.
వెంకటేశ్వర్రావు హోంగార్డుగా పనిచేస్తున్నాడు. తనను పోలీసుగా పరిచయం చేసుకున్న అతను శ్రీనివాసరావు గదిలోకి వెళ్లి బెట్టింగ్ ఆడిన వాయిస్ రికార్డు తన వద్ద ఉందని, దాని ఆధారంగా జైలుకు పంపుతానని బెదిరించాడు. కాగా సుమన్, ప్రశాంత్, సాయికుమార్లు మధ్యవర్తులుగా నటించి సదరు పోలీసుతో మాట్లాడామని 4లక్షల40 వేలు ఇస్తే వదిలివేస్తానని చెప్పాడని చెప్పి శ్రీనివాస్ రావు వద్ద నుంచి 2లక్షల 40 వేల రూపాయలను వసూలు చేశారు. అయితే ఆ తర్వాత తన వాయిస్ రికార్డు పోలీసులకు ఎలా వెళ్లిందని అనుమానం వచ్చిన శ్రీనివాస్ రావు తాను స్నేహితుల చేతిలో మోసపోయినట్లు గ్రహించి వెంటనే మైలార్దేవ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వీరి నాటకాన్ని బయటపెట్టి నలుగురిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.