డెహ్రాడూన్ : కైల్ నదిలో మునిగి నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని దేవల్ డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలోని కల్సిరిలో పరిధి చోటు చేసుకున్నది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి నలుగురు యువకులు కనిపించకుండా పోగా.. శనివారం ఉదయం నదిలో మృతదేహాలు కనిపించాయి. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నదిలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు.
యువకుల మరణాలకు కారణాలు తెలియరాలేదు. ఈత కోసం వెళ్లి మృతి చెందారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు యువకులు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇండ్లలో, పలుచోట్ల ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. నదిలో నలుగురు యువకులు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవగా.. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.