బెంగళూరు: భారత వాయుసేన (ఐఏఎఫ్) మాజీ పైలట్, ఆయన భార్య దారుణ హత్యకు గురయ్యారు. పరారీలో ఉన్న వారి ఇంట్లో పని చేసే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. చెన్నైకి చెందిన 70 ఏండ్ల రఘురాజన్, 63 ఏండ్ల భార్య ఆశాతో కలిసి బెంగళూరు పశ్చిమ శివారులోని ఈగిల్టన్ రిసార్ట్ విల్లాలో నివాసం ఉంటున్నారు. వారి ఇద్దరు కుమారులు ఢిల్లీలో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. మంగళవారం తమ తల్లిదండ్రులు ఎంతకీ ఫోన్ తీయక పోవడంతో ఏదో జరిగి ఉంటుందని కుమారులు అనుమానించారు. సెక్యూరిటీ గార్డ్‌కు ఫోన్ చేసి వెళ్లి చూడాలని కోరారు.
దీంతో సెక్యూరిటీ గార్డులు విల్లా వద్దకు వెళ్లగా ఆ దంపతులు ఉదయమే బెంగళూరు వెళ్లారని ఇంట్లో పని చేసే జోగిందర్ సింగ్ చెప్పాడు. వారు ఈ విషయాన్ని కుమారులకు తెలిపారు. అయితే జోగిందర్ సింగ్ చెప్పిన దానిపై కుమారులకు నమ్మకం కలుగలేదు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడాలని సెక్యూరిటీ గార్డులను కోరారు. వారు ఆ విల్లాలోకి వెళ్లి చూడగా ఇంటి లోపల రక్తం మడుగుల్లో మరణించిన వృద్ధ జంటను చూశారు. దీనిపై వారి కుమారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. నిద్రిస్తున్న వృద్ధ దంపతులను సుత్తితో తలపై కొట్టి దారుణంగా హత్య చేసినట్లు గ్రహించారు. నగదు, నగల కోసం ఇంట్లో పని చేసే జోగిందర్ సింగ్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.
కాగా, జోగిందర్‌తోపాటు మరో వ్యక్తిని విల్లా వద్ద చూసినట్లు సెక్యూరిటీ గార్డులు పోలీసులకు తెలిపారు. దీంతో పరారీలో ఉన్న పని మనిషి జోగిందర్ కోసం గాలిస్తున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కుమారులు వచ్చిన తర్వాత వృద్ధ దంపతుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.