రాంచీ: చెట్లను నరికినందుకు ఒక యువకుడ్ని స్థానికులు కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి దహనం చేశారు. జార్ఖండ్‌లోని సిమ్డేగా జిల్లాలో ఈ దారుణం జరిగింది. బెసరాజ్రా గ్రామానికి చెందిన సంజు ప్రధాన్ అనే యువకుడు మంగళవారం కట్టెలు అమ్ముకునేందుకు కమ్యూనిటీ స్థలంలోని పవిత్ర చెట్లను నరికాడు. కాగా, ఆ చెట్లను దైవంగా భావించే గ్రామస్తులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలోని ప్రజలు సమావేశమయ్యారు. అనంతరం కొందరు ఆగ్రహంతో సంజు ఇంట్లోకి చొరబడి అతడ్ని బయటకు ఈడ్చుకు వచ్చారు. చచ్చేంత వరకు దారుణంగా కొట్టారు. తర్వాత మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టి నిప్పుపెట్టారు.
మరోవైపు సంజు పదే పదే పవిత్ర చెట్లను నరుకుతున్నాడని, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. అతడు మళ్లీ పవిత్ర చెట్టు మొత్తాన్ని నరకడాన్ని చూసి సహించలేకపోయామన్నారు. కాగా, ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.