Chitrakoot : తన ప్రేయసిని బెదిరించేందుకు ఒక వ్యక్తి ఉరి వేసుకుంటున్నట్లు ఆడిన నాటకం.. అతడితోపాటు ప్రేయసి ప్రాణం కూడా తీసింది. ఈ ఘటనలో ఇద్దరూ వేర్వేరు ప్రదేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మధ్య ప్రదేశ్ లో ప్రాణాలు కోల్పోతే, ఇంకొకరు రాజస్థాన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.
మృతుల పేర్లు బయటకు రానప్పటికీ.. పోలీసుల కథనం ప్రకారం.. మధ్య ప్రదేశ్ లోని చిత్రకూట్ కు చెందిన ఒక వ్యక్తి, రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన అమ్మాయితో కొంతకాలం నుంచి రిలేషన్లో ఉన్నాడు. ఇరువురి కుటుంబాలు వారి పెళ్లికి కూడా అంగీకరించాయి. త్వరలో వారి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇదే సమయంలో ఇద్దరూ తమ సొంతూళ్లలో ఉంటున్నారు. తాజాగా వీడియో కాల్ చేసుకుని, ఒకరితో ఒకరు వాగ్వాదం చేసుకున్నారు. ఈ ఘటన సందర్భంగా ఆవేశానికి లోనైన యువకుడు ఆమెను బెదిరించేందుకు ఉరి వేసుకుంటున్నట్లు నటించాడు. కానీ, అనుకోకుండా నిజంగానే ఉరి బిగుసుకుని, వీడియో కాల్ లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సమయంలో అతడు చిత్రకూట్ లో ఉన్నాడు. అక్కడ తన ప్రియుడు మరణించడంతో వేదన చెందిన ఆ యువతి కూడా జైపూర్లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా వేర్వేరు చోట్ల ప్రేయసి, ప్రియుడు ప్రాణాలు కోల్పోయారు. ఇరు కుటుంబాలు వారికి సొంతూళ్లలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.