బెల్జియం : ఓ 37 ఏండ్ల వ్యక్తి తన టీచర్ పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. తనను అవమానించిందనే కోపంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఏడేండ్ల వయసులో అవమానానికి గురైన ఆ వ్యక్తి.. సరిగ్గా 30 ఏండ్ల తర్వాత టీచర్‌ను కత్తితో పొడిచాడు. ఒకట్రెండు కత్తి పోట్లు కాదు.. ఏకంగా ఆమెను 101 సార్లు కత్తితో పొడిచి తన కక్ష తీర్చుకున్నాడు. ఈ ఘటన బెల్జియంలో వెలుగు చూసింది.
గుంటెర్ ఉవెంట్స్ అనే వ్యక్తి వయసు ప్రస్తుతం 37 ఏండ్లు. ఉవెంట్స్కు ఏడేండ్ల వయసున్నప్పుడు.. స్కూల్‌కు వెళ్తున్న సమయంలో టీచర్ మరియా వెర్లిండెన్ అతన్ని అవమానిస్తూ వేధింపులకు గురి చేసేది. దీంతో అతను ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఏదో ఒక రోజు తన పగ తీర్చుకోవాలని ఉవెంట్స్ కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలో సరిగ్గా 30 ఏండ్ల తర్వాత(నవంబర్, 2020)లో వెర్లిండన్ ఇంటికెళ్లాడు ఉవెంట్స్. ఒంటరిగా ఉన్న టీచర్‌పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. 101 సార్లు కత్తితో పొడిచి ఆమె ప్రాణాలను బలిగొన్నాడు. హత్య జరిగిన చోట టేబుల్‌పై ఉన్న పర్సు, దాంట్లోని డబ్బులు అలాగే ఉన్నాయి. దీంతో దోపిడీ దొంగలు ఈ పని చేయలేదని పోలీసులు తేల్చారు. మరి ఎవరు మరియాను హత్య చేసి ఉంటారని పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా అనుమానితుల డీఎన్ఏలను పరిశీలించారు. కానీ నిందితుడిని పట్టుకోలేకపోయారు.
అయితే టీచర్‌ను హత్య చేసింది తానేనని ఉవెంట్స్ 16 నెలల తర్వాత తన ఫ్రెండ్‌కు చెప్పాడు. దీంతో అతను పోలీసులను అప్రమత్తం చేశాడు. అనంతరం ఉవెంట్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉవెంట్స్ డీఎన్ఏ సేకరించి, పరీక్షించగా, అతనే నేరం చేసినట్లు తేలింది. తనను అవమానించినందుకే టీచర్‌ను హత్య చేసినట్లు ఉవెంట్స్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.