న్యూఢిల్లీ: బాలుడ్ని కిడ్నాప్ చేసిన మాజీ పని మనిషి, ఆ ఇంటి యజమానిని రూ.1.10 కోట్లు డిమాండ్ చేశాడు. ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అతడ్ని చాకచక్యంగా పట్టుకుని ఆ బాలుడ్ని కాపాడారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. గాంధీనగర్‌కు చెందిన ఏడేండ్ల బాలుడి తండ్రి వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. ఆయన వద్ద మోను అనే వ్యక్తి హెల్పర్‌గా పని చేశాడు. ఈ నేపథ్యంలో యజమాని కుమారుడితో స్నేహంగా మెలిగిగాడు. కొన్ని రోజుల కిందట అతడు పని మానేశాడు.
మంగళవారం మోను ఆ బాలుడ్ని కలిశాడు. ఆడుకుందామని చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం బాలుడి తండ్రికి ఫోన్ చేసి వారి కుమారుడ్ని కిడ్నాప్ చేసినట్లు బెదిరించాడు. విడిచిపెట్టేందుకు కోటి పది లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కొంత తగ్గించాలని ఆయన కోరగా నిరాకరించాడు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు.
మోను ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అతడు గోకుల్‌పురి మెట్రో స్టేషన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి మోనును అరెస్ట్ చేశారు. అతడి చెరలో ఉన్న బాలుడ్ని కాపాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.