న్యూఢిల్లీ: ఒక మహిళను హత్య చేసిన ముగ్గురు పొరుగింటి వ్యక్తులు అరెస్టయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ద్వారకా ప్రాంతం బిందాపూర్లోని ఓం విహార్‌లో నివాసం ఉండే 22 ఏండ్ల డాలీ గబ్బర్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నది. మంగళవారం ఫ్రెండ్ బర్త్ డేకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది.
అర్ధ రాత్రి వేళ డాలీ ఇంటికి 500 మీటర్ల దూరంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె మెడ, చేతులు, ఛాతీ, వెనుక వైపు కత్తులతో ఆరు సార్లు పొడిచాడు. దీంతో ఆమె కింద పడి రక్తం మడుగుల్లో మరణించింది. గమనించిన ఒక డెలివరీ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.దీంతో మహిళ హత్య జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించారు. పొరుగున ఉండే అంకిత్ గబా, మనీష్, హిమాన్షును అరెస్ట్ చేశారు.
కాగా, తనతో రావాలని అంకిత్ కొన్ని ఏండ్లుగా డాలీని అడుగుతుండగా ఆమె నిరాకరిస్తున్నదని మృతురాలి తల్లి తెలిపింది. దీంతో కక్షగట్టి తమ కుమార్తెను అతడు హత్య చేశాడని ఆరోపించింది. డాలీతో మనీస్, హిమాన్షు రాఖీ కట్టించుకునేవారని, అలాంటి వారు ఆమె హత్యకు ఎలా సహకరించారో తెలియడం లేదని ఆమె వాపోయింది. తన భర్త ఆటో నడుపుతాడని, తమ కుమార్తెనే కుటుంబానికి ఆధారమంటూ ఆమె తల్లి రోధించింది.