న్యూఢిల్లీ: ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ భార్యను కారు డ్రైవర్ హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. సోమవారం వాయువ్య ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో రోడ్డు పక్కన భయంతో కూర్చున్న అనుమానితుడు రాకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్నడి ప్రశ్నించగా ఒక మహిళను గొంతునులిమి, విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు నిందితుడు తెలిపిన సంత్ నగర్‌లోని మహిళ ఇంటికి వెళ్లి ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. మృతురాలు ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ వీరేందర్ కుమార్ భార్య పింకీగా గుర్తించారు.
కాగా, ప్రొఫెసర్ వీరేందర్ కుమార్ టాప్ ఫ్లోర్‌లోని ఇంటిలో మూడేండ్లుగా తాను కిరాయికి ఉన్నట్లు నిందితుడు రాకేశ్ పోలీసులకు తెలిపాడు. ఉద్యోగం లేకపోవడంతో ఆయన కారును అద్దెకు ఇవ్వగా ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రొఫెసర్ వీరేందర్‌కు 32 ఏండ్ల పింకీతో వివాహం అయ్యిందన్నాడు.
అయితే తనకు స్థిరమైన సంపాదన లేకపోవడంతో అద్దె చెల్లించలేకపోయానని రాకేశ్ తెలిపాడు. దీంతో తాను వదినగా భావించిన పింకీ ఇటీవల అద్దెకు ఉంటున్న ఇంటిని బలవంతంగా ఖాళీ చేయించిందని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో వీరేందర్ ఇంట్లో లేని సమయంలో ఆయన భార్య పింకీని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో హత్య కేసు నమోదు చేసిన నిందితుడు రాకేశ్‌ను అరెస్ట్ చేశారు.