ఢిల్లీ: ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ ఇంటి పైకప్పు కూలి తండ్రీ కొడుకులు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఇంకో వ్యక్తి ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. వాయవ్య ఢిల్లీలోని బేగంపూర్ ఏరియాలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బేగంపూర్ ఏరియాలోని తమ ఇంట్లో శుక్రవారం రాత్రి సోను (30), అతని తండ్రి కేదార్ (65)తోపాటు ప్రమోద్ (43), అనిల్ (40) నిద్రపోయారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంటి పైకప్పు కూలి వాళ్లపై పడింది.
ఈ ఘటనలో కేదార్, సోను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమోద్ తలకు బలమైన గాయాలయ్యాయి. అనిల్‌ను ఎలాంటి గాయాలు లేకుండా రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని స్థానిక అంబేద్కర్ ఆస్పత్రికి తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపంచినట్లు చెప్పారు.