అహ్మదాబాద్ : ప్రేమ వ్యవహారంలో గర్ల్‌ఫ్రెండ్ కుటుంబ సభ్యులు దళిత యువకుడి (23)ని అపహరించి తీవ్రంగా వేధించిన ఘటన గుజరాత్లో వెలుగుచూసింది. మేఘానినగర్‌కు చెందిన దళిత యువకుడు రాహుల్ చమర్ను వినోద్ దతానియా అనే వ్యక్తి బపూర్నగర్లోని డీ మార్ట్ షాప్ వెలుపల ఈనెల 1న అపహరించాడు. తన కూతురితో సంబంధం ఉందనే ఆగ్రహంతో రాహుల్‌ను దతానియా తీవ్రంగా హింసించాడు.
బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షహర్కోట ప్రాంతంలోని విజయ్ మిల్లులో యువకుడిని నిర్బంధించినట్టు అక్టోబర్ 2 రాత్రి సమాచారం అందింది. పోలీసులు ఘటనాస్ధలానికి వెళ్లగా ముఖం, శరీరంపై గాయాలతో బాధితుడు కనిపించాడు. రాహుల్ కాళ్లు, చేతులు కట్టేసిన నిందితుడు అతడిని తీవ్రంగా హింసించాడు. బాధితుడిని కాపాడిన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. నిందితులు వినోద్ దతానియా, ప్రితేష్ దతానియా, రామ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.