బొంరాస్‌పేట : సోదరి ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన బొంరాస్‌పేట పీఎస్ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ ప్రియాంకరెడ్డి తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు సంపంగి సంతోష్(24), సంపంగి నర్సింహా కర్ణాటకలో ఉండే తమ సోదరి కుమారుడి పుట్టువెంట్రుకలు తీసే కార్యక్రమానికి వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం గుమ్మడిదల నుంచి బైకుపై బయలుదేరారు. మండలంలోని తుంకిమెట్ల సమీపంలో కాకరవాణి వాగు వంతెనపై శుక్రవారం రాత్రి వీరి బైకు వెనుక నుంచి లారీ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న సంతోష్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా నర్సింహకు గాయాలయ్యాయి. ప్రమాదంలో బైకు నుజ్జునుజ్జయింది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, గాయపడిన నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.