క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో చూసినట్లు ఒక చిన్న క్లూతో మర్డర్ కేసు సాల్వ్ చేశారు పోలీసులు. ఈ ఉదంతం భివాండి నిజామ్పూర్లో వెలుగు చూసింది. ఒక 45 ఏళ్ల వ్యక్తి హత్య జరిగింది. ఈ కేసులో ఎటువంటి క్లూ దొరక్కపోవడంతో పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు.
హత్యకు గురైన వ్యక్తి ఎవరనే విషయం కూడా పోలీసులకు తెలియలేదు. మృతదేహం కుళ్లడం ప్రారంభించడంతో అతన్ని గుర్తించడం వల్ల కాలేదు. ఇలాంటి స్థితిలో జనవరి 20న లభించిన ఈ మృతదేహం ఆనవాలు తెలుసుకోవడం కోసం పోలీసులు నానా తిప్పలు పడ్డారు.
అలాంటి సమయంలో వారికి చిరిగిపోయిన ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ లభించింది. దీని సాయంలో ఇది రాసిన డాక్టర్, ఫార్మసిస్ట్ వివరాలను అధికారులు ట్రేస్ చేశారు. అలా మృతుడి పేరు అర్మాన్ షేర్ అలీ షా అని తెలుసుకున్నారు.
గతవారం ఒక తెల్ల సంచిలో అతని మృతదేహం పోలీసులకు లభించింది. అతని శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.