మొయినాబాద్ : ఇంటిలోని విందు కోసం మేకను కొనుగోలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి మూసీ వాగు దాటుతుండగా నీటి ప్రవాహనికి గల్లంతై శవమై లభించాడు. ఈ సంఘటన శంకర్పల్లి మండల పరిధిలోని మూసీ వాగులో చోటు చేసుకుంది. శంకర్పల్లి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండల పరిధిలోని గోపులారం గ్రామానికి చెందిన కుంటి నర్సింలు (58) ఇంటిలో ఓ విందు కార్యక్రమం కోసం మేకను కొనుగోలు చేయడానికి ఆయన శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరాడు. మొయినాబాద్ మండల పరిధిలోని చిన్నమంగళారం గ్రామంలోని నర్సింలు బంధువుల వద్ద ఉన్న మేకను కొనుగోలు చేయడానికి చిన్నమంగళారం-గోపులారం గ్రామాల మధ్య ఉన్న మూసీ వాగు దాటే ప్రయత్నం చేశాడు.
వాగులో నీటి ప్రవాహం ఉండటంతో నీటి ప్రవాహనికి కొట్టుకుపోయి నీటిలో గల్లంతయ్యాడు. అయితే నర్సింలు ఇంటికి వెళ్లకపోవడంతో శనివారం ఉదయం కుటుంబ సభ్యులు అతన్ని వెతకడం ప్రారంభించాడు. గోపులారం గ్రామ పంచాయతీలోని సీసీ కెమెరాలను పరిశీలించగా నర్సింలు చిన్నమంగళారం వైపు వెళ్లినట్లు ఉంది. దీంతో కుటుంబ సభ్యులు మూసీవాగు వైపు వెళ్లి వెతకగా అతని చెప్పులు వాగు ఒడ్డున కనిపించాయి. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం గోపులారం, చిన్నమంగళారం గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వాగులో అతను దాటిన ప్రదేశం నుంచి అర కిలో మీటరు వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అర కిలోమీటరు దూరంలో వాగులో చెట్ల పొదలకు మృతదేహం తట్టి ఉంది.
మృతదేహాన్ని తీసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య, బిడ్డ ఉందని పోలీసులు తెలిపారు.