పెద్దేముల్ : రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబంలో అనుకోకుండా జరిగిన షాట్ సర్క్యుట్ సంఘటనతో ఓ ఇల్లు పాక్షికంగా ధ్వంసమై పూర్తిగా దగ్ధం అయిన సంఘటన మంగళవారం పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు, ఇంటి యాజమాని తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దాసరి యానగుంది నాగభూషణం, నర్సమ్మ దంపతులు బుట్టి దాసరి వృత్తిలో భాగంగా గ్రామ గ్రామాన తిరుగుతూ బొమ్మలు, స్టీల్ సామన్లు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో మంగళవారం ఉదయం కూడా సుమారు 6గంటల సమయంలో వృత్తి పనులపై ఇంటికి తాళం వేసి బయలు దేరారు. అంతకుముందు ఉదయం 5గంటలకు కరెంట్ పోయి సుమారు 6గంటల ప్రాంతంలో తిరిగి రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వచ్చిన కరెంట్‌తో నాగభూషణం ఇంట్లో షాట్ సర్క్యుట్‌తో మంటలు చెలరేగి ఇంటి పైకప్పు పై నుంచి పొగలు వెలువడ్డాయి.
అక్కడే ఆడుకొంటున్న కొంతమంది చిన్నారులు ప్రమాదాన్ని గమనించి విషయాన్ని పెద్దవారికి చెప్పగా వారు బకెట్ల సాయంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అనంతరం వారు ఇంటి తాళం దాచి ఉంచిన విషయాన్ని గమనించి తాళం తెరచి చూశారు. అప్పటికే ఇంట్లో ఉన్న స్యామ్సంగ్ ఫ్రిజ్, ఎల్జీ టీవీ, మిక్సర్ గ్రాండైర్, స్టెప్లైజర్, ఇంటి మీటరు, కరెంట్ స్విచ్ బోర్డు పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో పాటు ఇంటిపై కప్పు కోసం వేసిన దూలాలు, వాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో నాగభూషణంకు సుమారు రూ. 25 వేల నష్టం వాటిల్లడంతో జరిగిన సంఘటనపై స్థానికంగా ఉన్న డివై నర్సింలు, చిన్ననర్సింలు పోలీసులకు, విద్యుత్ అధికారులతో సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉన్న నాగభూషణం కుటుంబం గ్రామ గ్రామాన తిరుగుతూ కుల వృత్తిని నమ్ముకొని ప్రతి రోజు రూ. 200నుంచి రూ. 300 సంపాదిస్తూ జీవనాన్ని వెల్లదీస్తున్నారు.
ఇల్లు దగ్ధమై ఆస్తి నష్టం వాటిల్లడం, ఇల్లు పాక్షికంగా ధ్వంసం కావడంతో వారు దిక్కుతోచని స్థితిలో లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే బీసీ కాలనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద తరుచూ ఏదో ఒక సమస్య వస్తూ మాటి మాటికి ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయని దానికి శాశ్వత పరిష్కారం చేయాలని పలుమార్లు విద్యుత్ అధికారులను కోరగా వారు ఆ సమస్యను పరిష్కరించడంలో విఫలమవడంతోనే ఇలాంటి సంఘటనలు జరిగి తాము తీవ్రంగా నష్టపోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.