Man Kidnap | ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి అతడి వద్ద ఉన్న రూ.34 లక్షలను దోచుకున్నారు. ఈ ఘటనలో ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సహా ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలు ఉన్నారు. ఉత్తర ఢిల్లీలోని సబ్జి మండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని పాత కరెన్సీ నోట్ల మార్పిడి చేసే ఓ వ్యాపారి సహాయకుడిని ఈ నెల 6 వ తేదీన రిక్షాల వస్తుండగా పోలీసు దుస్తుల్లో ఉన్న నలుగురు వ్యక్తులు అడ్డగించారు. బ్యాగులో ఏమున్నదంటూ ఆరా తీస్తూ ఆయన్ను కిడ్నాప్ చేశారు. గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అతడి బ్యాగులో ఉన్న దాదాపు రూ.34 లక్షల నగదును దోచుకున్నారు. అనంతరం వజీరాబాద్ ఫ్లై ఓవర్ వద్ద బాధితుడిని వదిలిపెట్టి వెళ్లారు.
సమచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సీసీటీవీల ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి దోపిడీ చేసిన నగదులో నుంచి కొంత స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దోపిడీకి సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కీలక పాత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్ట్ అయిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఢిల్లీ మెట్రో స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. పరారీలో ఉన్న మరో ఇద్దరిని పట్లుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు నార్త్ ఢిల్లీ డీసీపీ సాగర్ సింగ్ కల్సి చెప్పారు.